జీటీఎస్ దేవస్థానంలో ఘనంగా దుర్గాష్టమి పూజలు
వెంగళరావునగర్, మేజర్ న్యూస్:దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమిని పురస్కరించుకుని జీటీఎస్ దేవస్థానంలో శనివారం శ్రీ భవానీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దుర్గామాత స్వరూపంలో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి భక్తుల భాగస్వామ్యంతో నవావరణ శ్రీచక్ర పూజ నిర్వహించడంతో పాటు చండీ హోమం జరిపించారు.
ఈ సందర్భంగా దేవస్థానానికి విచ్చేసిన భక్తులతో పాటు మాలధారణ చేసిన భవానీలకు పెద్దఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. దేవస్థానం ఈవో గుమ్మడిదల సుధాకర్ అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.
జీఎస్టీ అదనపు కమిషనర్ సచిన్ బాలాసాహెబ్ సావంత్ దంపతులు దేవస్థానానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో సుధాకర్ వారిని సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.