జీసీసీ బాధిత కార్మికులకు న్యాయం చేయాలి
సూర్య ఉట్నూర్: తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ )లో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన బాధిత కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, గిరిజన విద్యార్థి సంఘ నాయకులు జాదవ్ సుమేష్, భుక్య కుమార్ ఆధ్వర్యంలో బాధిత కార్మికులు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ( ఎన్సీఎస్టీ ) సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జీసీసీ లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించడం వల్ల అనేక నిరుపేద గిరిజన కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది కార్మికులు 20 నుంచి 30 సంవత్సరాల పాటు సేవలందించినప్పటికీ, ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని తెలిపారు.> ఎన్ ఎ సి ఓ ఎఫ్ ద్వారా జీసీసీ కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు పేర్కొంటూ, ఈ విధానాన్ని పునఃపరిశీలించి ప్రభుత్వ జీసీసీ ద్వారానే కార్యకలాపాలను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
- ఎన్సీఎస్టీ సభ్యుడి సానుకూల స్పందన : బాధిత కార్మికుల సమస్యలను విన్న ఎన్సీఎస్టీ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సానుకూలంగా స్పందించి, సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ / ప్రత్యేక కార్యదర్శి బి.ఎన్. సంతోష్‌తో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు బాధితులు తెలిపారు.
- పాల్గొన్న బాధిత కార్మికులు : ఈ వినతిపత్రం సమర్పణలో చాకటి సాయికుమార్, సోయం గజానంద్, జాదవ్ శ్రీనివాస్, సాయికుమార్, జుగునాథ్ గంగారం, వడమ భీమ్రావు, బాధిరావు, ఇర్ఫాన్, గోపాల్, రాందాస్, రవి, మునీర్, నబీ తదితర బాధిత కార్మికులు పాల్గొన్నారు.ప్రధాన డిమాండ్ జీసీసీ ప్రభుత్వ సంస్థ ద్వారానే కొనసాగాలి – ఉపాధి కోల్పోయిన గిరిజన కార్మికులకు తక్షణ న్యాయం చేయాలి