జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం
సూర్య, లక్షెట్టిపేట :మహత్మాగాంధీ జయంతి సందర్భంగా లక్షెట్టిపేట సబ్ జైల్ లో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని జైలు పర్యవేక్షణాధికారి స్వామి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి పాల్గొని ఖైదీలను ఉద్దేశించి ప్రసంగించారు.
కోపాన్ని తగ్గించుకుంటే నేరాలు జరిగే అవకాశం ఉండదని, క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడి జైలుకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. నేర ప్రవృతిని విడనాడి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తయారవ్వాలన్నారు. అనంతరం ఖైదీలకు బహుమతులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారి స్వామి తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.