ఇల్లందు ఆర్టీసీ బస్టాండ్‌లో కిక్కిరిసిన ప్రయాణికుల రద్దీ…
ఇల్లందు ఆర్టీసీ బస్టాండ్‌లో కిక్కిరిసిన ప్రయాణికుల రద్దీ…
దసరా పండుగ నేపథ్యంలో ఇల్లందు ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. పండుగ సెలవులు ప్రారంభం కావడంతో సొంతూళ్లకు వెళ్లే ప్రజలు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే వారు పెద్ద సంఖ్యలో బస్టాండ్‌కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులతో బస్టాండ్ రద్దీగా మారుతోంది. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దసరా పండుగ అంటేనే కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే పండుగ. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, ఇతర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బస్టాండ్లలో సాధారణ రోజుల కంటే అధిక రద్దీ కనిపిస్తోంది. గుండాల, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం తదితర దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
*బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ*
ఇల్లందు బస్టాండ్‌కు చేరుకున్న ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు సరైన సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే బస్సుల్లో ప్రయాణికులు నిండిపోవడంతో తరువాత వచ్చే బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీ కారణంగా కొందరు నిలబడే ప్రయాణం చేయాల్సి వస్తుండగా, మరికొందరు తమ పిల్లలను తీసుకొని బస్సు ఎక్కేందుకు అవస్థలు పడుతున్నారు.
పండుగ సమయాల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని తెలిసినా, అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన రూట్లలో అదనపు బస్సులు నడపాలని కోరుతున్నారు.
*ఇల్లందు సీఐ తాటిపాముల సురేష్ హెచ్చరిక*.
దసరా పండుగ సీజన్ కాబట్టి బస్టాండ్లో ప్రయాణికులు తగు జాగ్రత్తలు పాటించాలని ఇల్లందు సర్కిల్ ఇన్స్పెక్టర్ తాటిపాముల సురేష్ కోరారు. ముఖ్యంగా జేబు దొంగలు బస్టాండ్ లో సంచరిస్తున్నారని, ప్రయాణికులు తమ విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎవరైనా అపరిచిత వ్యక్తులు కల్పించినచో వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
సూర్య ప్రతినిధి రాజేష్ ఇల్లందు ఆర్ సి