తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు
*★ ఇర్విన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు*
*★ సంబరాల్లో పాల్గొని బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించిన ఉపసర్పంచ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు గాదెమోని దళపతి గౌడ్*
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు అని మాడ్గుల మండలం ఇర్వీన్ ఉపసర్పంచ్, యువజన కాంగ్రెస్ కల్వకుర్తి అసెంబ్లీ అధ్యక్షులు గాదెమోని దళపతిగౌడ్ అన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, ప్రకృతి ఆరాధనకు చిహ్నంగా ప్రతియేటా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకోవడం తెలంగాణలో ఆనవాయితీ అని ఆయన పేర్కొన్నారు.
మాడ్గుల మండలం ఇర్విన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు లిండం పర్వతాలు అధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఉపసర్పంచ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు గాదెమోని దళపతిగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఉత్సవాల విశిష్టతను విద్యార్థులకు వివరించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో దళపతిగౌడ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. బతుకమ్మ పండుగ భక్తి, సంతోషం, ప్రకృతితో మానవ సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
- ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల