ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇవాళ అర్థరాత్రి నుంచి మొబైల్ ఇంటర్నెట్, డేటా సేవలను నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చిన ధర్నా, 'ఛలో సంసద్' నిరసనల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం దాదాపు 25,000 మంది పోలీసులను సెంట్రల్ ఢిల్లీ నలుమూలలా భారీగా మోహరించారు. జన్ పథ్, కర్తవ్య పథ్, జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. మరోవైపు రవాణా వ్యవస్థపై కూడా ఆంక్షలు విధించారు. న్యూఢిల్లీ, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లకు చేరుకునే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు ఢిల్లీ సరిహద్దుల వద్ద తనిఖీలను తీవ్రతరం చేసి, నగరంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లాక్‌డౌన్‌ను తలపించేలా వీధుల్లో పోలీసుల మోహరింపు కనిపిస్తోంది.