జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ప్రజా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈ. సందీప్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పోలీస్ శాఖ అధికారులు, మండల తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సమన్వయంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ గ్రామాలను గుర్తించారు. అలాగే, ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసి, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా, పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరమైన ఏర్పాట్లను వెరిఫై చేశారు.ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు మండల పరిషత్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి, ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం పెంపొందిస్తూ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామని అన్నారు.
రవికుమార్
అనకాపల్లి ప్రధాన ప్రతినిధి