విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులే మార్గదర్శకులు
- మిట్స్ యూనివర్సిటీలో ఘనంగా టీచర్ అండ్ పేరెంట్స్ మీటింగ్
మదనపల్లె : మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టీచర్ -పేరెంట్స్ మీటింగును శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యపై ఆసక్తి,శ్రద్ధతో చదువుతూ తమ జీవిత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమాభిమానాలు చూపడంతోపాటు,వారిని సరైన మార్గంలో నడిపిస్తూ క్రమశిక్షణ,బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవర్చేలా చూడాలన్నారు.చెడు వ్యసనాలకు బానిసలై ఎంతోమంది యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని,విద్యార్థులు అలాంటి అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలన్నారు.ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించాలనే ఆకాంక్ష ఉంటుందని,అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదల,క్రమశిక్షణ,నిరంతర కృషి అవసరమని తెలిపారు.లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలకు భయపడి వెనుకడుగు వేయకుండా,సమస్యలను అధిగమించేందుకు తగిన మార్గాలను అన్వేషించాలని విద్యార్థులకు సూచించారు.ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నిరాశ చెందకుండా,ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సాధించడం సాధ్యమవుతుందన్నారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి,వారి ఆశయాలను నెరవేర్చేలా కష్టపడి చదవాలన్నారు.తల్లిదండ్రుల ప్రోత్సాహం,అధ్యాపకుల మార్గదర్శకత్వం విద్యార్థుల విజయానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు.విద్యార్థుల విద్యా పురోగతిని తెలుసుకునేందుకు తల్లిదండ్రులు కనీసం నెలకు ఒకసారైనా యూనివర్సిటీని సందర్శించి,తమ పిల్లల తరగతి హాజరు,పరీక్షల్లో పనితీరు,విద్యా ప్రగతిపై సంబంధిత అధ్యాపకులతో చర్చించాలన్నారు.విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన విద్యా సదుపాయాలు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయని,వాటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి (ఇంచార్జి) డాక్టర్ ఆర్.నిధ్య,డీన్-స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా,మేనేజర్-స్టూడెంట్- పేరెంట్ రిలేషన్స్ కె.ఎం.డి రియాజ్ అలీ,కో-ఆర్డినేటర్ డాక్టర్ కృష్ణయ్య,అధ్యాపకులు,విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి