గుల్మొహర్ పార్క్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు:. పాల్గొన్న తెల్లాపురం శ్రీనివాస్ కుటుంబ సభ్యులు!
సూర్య సిటీ & కల్చరల్ డెస్క్, గచ్చిబౌలి: తెలంగాణ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ సంబురాలు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మొహర్ పార్క్ కాలనీలో అత్యంత వైభవంగా జరిగాయి. రంగురంగుల ప్రకృతి పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను కాలనీ ప్రాంగణంలో ప్రతిష్ఠించి, మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో గుల్మొహర్ కాలనీకి చెందిన ప్రముఖులు తెల్లాపురం శ్రీనివాస్ (ముదిరాజ్) కుటుంబ సభ్యులు పాల్గొని బతుకమ్మ పూజలు నిర్వహించారు. మహిళలంతా బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ, లయబద్ధమైన అడుగులతో గౌరమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. అనంతరం 'వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా' అంటూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను సమీప జలాశయంలో నిమజ్జనం చేసి, ఆడపడుచులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు.