ఎల్నినో ప్రభావంతో నీటి సమస్యపై ఆన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ ప్రియాంక
నారాయణపేట సూర్య ప్రతినిధి
ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, ఇప్పటికే పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నాయని, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బోర్ల రీఛార్జ్ పనులను వేగవంతం చేయడంతో పాటు నీటి వనరులను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ప్రజలు తాగునీటిని పొదుపుగా వినియోగించేలా అవగాహన కల్పించాలని, రైతులకు తక్కువ నీటితో సాగు చేసే పంటలపై సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. నీటి ఎద్దడి నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.