ఐదో రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు
పెద్దకొత్తపల్లి, సూర్య న్యూస్: మండల కేంద్రంలో ప్రతిష్ఠించిన అమ్మవారు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రథమ పౌరురాలు, సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు మాట్లాడుతూ దేవి నవరాత్రులు భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకలని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో శాంతి, ఐకమత్యం, సౌభాగ్యం వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. మండల కేంద్రంలో దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో గడ్డికొప్పుల నడ్డిపన్న మల్లేష్, భాగ్య, శివకుమార్, విజయ్, ఖాదర్ లింగం, గణేష్, రాజేష్, నిరంజన్, సురేష్, పరమేశ్వర్, ప్రశాంత్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.