భీమవరం మున్సిపల్ ఎన్నికల బరిలో పళ్ళ ఏసుబాబు భార్య హేమలత: కూటమి మద్దతుతో మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీకి సన్నద్ధం
భీమవరం సూర్య న్యూస్:భీమవరం పట్టణ మున్సిపల్ ఎన్నికల బరిలో ప్రముఖ కాంట్రాక్టర్, తారకరామా కన్స్ట్రక్షన్స్ అధినేత పళ్ళ ఏసుబాబు కుటుంబం నిలవనుంది. తన సతీమణి పళ్ళ హేమలతను మున్సిపల్ చైర్పర్సన్ స్థానానికి అభ్యర్థిగా రంగంలోకి దించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
గురువారం ఆయన ఇంటి వద్ద జరిగిన పత్రిక సమావేశంలో ఏసుబాబు మాట్లాడుతూ, పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా స్థానికులు తనను తమ సొంత మనిషిగా భావించి రాజకీయాల్లోకి రావాలని కోరడంతో కుటుంబ సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భీమవరంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంట్రాక్టర్గా పనిచేస్తూ పట్టణంలోని వీధులు, ప్రజల అవసరాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నానని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేతో భేటీ అయి తన ఉద్దేశాన్ని వివరించానని, కూటమి తరఫున నిర్ణయం మేరకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. త్వరలోనే పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, కూటమి భాగస్వాములను కలిసి మద్దతు కోరనున్నట్లు ఆయన తెలిపారు.