బోడంపహాడ్ లో .. ఘనంగా మహిళా రైతుల దినోత్సవం
మహిళా రైతుల కృషికి గుర్తింపుగా సన్మానం
వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకం.. మండల వ్యవసాయ అధికారి విజయచంద్ర
షాబాద్ : అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం–2026 సందర్భంగా షాబాద్ మండలం బోడంపహాడ్ గ్రామంలో అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సబ్బరిగారి కమలమ్మ చెన్నయ్య, మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర ఆధ్వర్యంలో మహిళా రైతులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కమలమ్మ మాట్లాడుతూ... వ్యవసాయ రంగంలో మహిళా రైతుల పాత్ర ఎంతో కీలకమని, వారి కృషి వెలకట్టలేనిదని అన్నారు. పంటల సాగు నుంచి ఆహార భద్రత వరకు మహిళా రైతులు అందిస్తున్న సేవలను గుర్తించి, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర మాట్లాడుతూ... మహిళా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ, శాస్త్రీయ సాగు విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకొని పంటల దిగుబడిని పెంచుకోవాలని, స్థిరమైన వ్యవసాయ విధానాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేసినప్పుడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని తెలిపారు.మహిళా రైతుల గౌరవం, సాధికారత, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వారిని వ్యవసాయ రంగంలో మరింత ప్రోత్సహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈవో మౌనిక, పంచాయతీ కార్యదర్శి స్నేహలత, ఉప సర్పంచ్ కళ్ళెం శ్రీనివాస్, సబ్బరిగారి చెన్నయ్య, కళ్ళెం ఆనంద్, కాకునూరి అశోక్, రాజు, గొల్ల నర్సింహులు, రఘుపతిరెడ్డి, వెంకటయ్య, మహిళా రైతులు రాధిక, కోట లక్ష్మి, కారు సువర్ణ, కళ్ళెం చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్15)