నూనెగింజల సాగుతో అధిక ఆదాయం... గిరిజన రైతులకు అవగాహన కార్యక్రమం
మెలియాపుట్టి, సూర్య : గిరిజన రైతులు నూనెగింజల పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు, అధిక దిగుబడులు సాధించి మెరుగైన ఆదాయం పొందాలని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ ఉపసంచాలకులు ఆర్. శ్రీనివాసరావు సూచించారు. మెలియాపుట్టి మండలం ఇల్లాయపురం రైతు సేవా కేంద్రం పరిధిలోని ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు జాతీయ నూనెగింజల అభివృద్ధి పథకం (ఎన్ఎంఈఓ-ఓఎస్), డీఏజీజీయూఏపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా రైతులకు తోడ్పాటు అందిస్తున్నాయని తెలిపారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, వేరుశనగ వంటి నూనెగింజల పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. సాగు విస్తీర్ణాన్ని పెంచడమే కాకుండా, శాస్త్రీయ పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. నూనెగింజల పంటల సాగు ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహక చర్యలు చేపడుతోందని వివరించారు. రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతి ప్రసాద్ మాట్లాడుతూ నూనెగింజల పంటల సాగులో అనుసరించాల్సిన పద్ధతులు, విత్తనాల ఎంపిక, పంటల యాజమాన్యం, ఎరువుల వినియోగం తదితర అంశాలపై రైతులకు వివరించారు. సమగ్ర వ్యవసాయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా పంటల నాణ్యతను పెంచడంతో పాటు ఆశించిన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ అనూష మాట్లాడుతూ నూనెగింజల పంటలను ఆశించే వివిధ రకాల చీడపీడలను గుర్తించే విధానం, వాటి నివారణ చర్యలను వివరించారు. పంటల ఎదుగుదల దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టి, అవసరమైన సమయంలో సమర్థవంతమైన నివారణ చర్యలు పాటించడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రభావతి, గ్రామ ఉద్యాన సహాయకులు షణ్ముఖరావు, ఇల్లాయపురం రైతు సేవా కేంద్ర పరిధిలోని ఆర్ఓఎఫ్ఆర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : నాగిరెడ్డి, మెలియాపుట్టి, శ్రీకాకుళం జిల్లా.