పుంగనూరులో అరాచకం
పెనుకొండ టౌన్: పుంగనూరులో చోటుచేసుకున్న రాజకీయ హింస, వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాన్వాయ్పై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని పెనుకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి విశ్వనాథ్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను దౌర్జన్యంగా అడ్డుకోవడం, వాహనాలను ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి పార్టీకీ ఉంటుందని, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి అడ్డుకోవాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల భద్రతను పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. పుంగనూరు ఘటనలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేలా చూడాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.