బుడగ జంగం స్మశాన వాటికకు రెండు ఎకరాల భూమి కేటాయింపు
గ్రామ సభలో తీర్మానం.. రెవెన్యూ అధికారులకు నివేదించిన సర్పంచ్ రామేశ్వర్
మర్పల్లి, మేజర్ న్యూస్, (అక్టోబర్ 3):
బుడగ జంగం వర్గానికి స్మశాన వాటిక ఏర్పాటుకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని మర్పల్లి గ్రామ సభ తీర్మానించింది. మర్పల్లి మండల కేంద్రంలోని 88వ సర్వే నంబర్‌లో ప్రభుత్వానికి చెందిన భూమిలో కొంత భాగం ఆక్రమణకు గురైనట్లు గ్రామ సభ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ ఎం. రామేశ్వర్ తెలిపారు.88వ సర్వే నంబర్‌లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ కబ్జాకు గురైనట్లు గ్రామ సభలో చర్చించారు. అందులో నుంచి బుడగ జంగం వర్గానికి స్మశాన వాటిక అవసరాల కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించాలని తీర్మానం చేసి, తదుపరి చర్యల కోసం రెవెన్యూ అధికారులకు నివేదించినట్లు సర్పంచ్ వెల్లడించారు.బుడగ జంగం వర్గానికి స్మశాన వాటిక కోసం స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గ్రామ సభ తీర్మానం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ భూమిని పరిరక్షించడంతో పాటు అర్హులైన వర్గాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామ పెద్దలు కోరారు.ఈ సమావేశంలో గ్రామ పెద్దలు ఎం.ఏ. సలీం, పి. రాములు, వి. వెంకటేశం, గ్రామ కార్యదర్శి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ రాములు.