భవానీపురంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు: సంప్రదాయ ఆటపాటలతో హోరెత్తించిన మహిళలు.
గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : తెలంగాణ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ సంబురాలు భవానీపురం కాలనీలో అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. పండుగను పురస్కరించుకుని కాలనీ ఆడపడుచులు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.
ఆటపాటలతో హోరెత్తించిన మహిళలు:
రంగురంగుల ప్రకృతి పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, కాలనీ ప్రాంగణంలో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలిచారు. అనంతరం బతుకమ్మల చుట్టూ తిరుగుతూ లయబద్ధమైన చప్పట్లతో సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ప్రాంగణాన్ని హోరెత్తించారు. మహిళల ఆటపాటలతో ఆ ప్రాంతమంతా పండుగ శోభతో కళకళలాడింది.
బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు:
పూజల అనంతరం ‘వెళ్లిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా’ అంటూ ఆడపడుచులు భక్తిప్రపత్తులతో బతుకమ్మలను జలాశయంలో నిమజ్జనం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. కాలనీవాసులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వాయనాలు ఇచ్చిపుచ్చుకుని ఆనందోత్సాహాల నడుమ వేడుకలను ముగించారు.