బతుకమ్మ వేడుకలకు గుర్జాల్ సర్పంచ్ మైక్ సెట్ కానుక
కృష్ణ సూర్య న్యూస్ :
తెలంగాణ ప్రజలు ఎంతో విశిష్టంగా జరుపుకునే బతుకమ్మ సంబరాలు, దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గుర్జాల్ గ్రామ సర్పంచ్ కమలమ్మ మరియు వారి తనయుడు సంతోష్ పాటిల్ గ్రామంలోని ఆడపడుచులకు మైక్ సెట్ (బ్లూ టూత్ స్పీకర్) ను ఆదివారం అందజేశారు. పండుగ వేడుకలు మరింత ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు తమవంతు సహాయంగా ఈ బహుమతిని అందించినట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తనయుడు సంతోష్ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ పూల పండుగ బతుకమ్మ మన విశిష్టమైన సంస్కృతి, సాంప్రదాయాలకు, ఐక్యతకు నిలువెత్తు ప్రతీక అన్నారు.
గ్రామంలోని ఆడపడుచులందరూ తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, మైక్ సెట్ పాటల సప్పుడు మధ్య ఒకచోట చేరి సంతోషంగా ఈ ఉత్సవాలను జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న కానుకను అందజేశాం అని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఉత్సాహంగా, ఐకమత్యంతో పండుగ జరుపుకోవాలని కోరుతూ గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ, దేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు.
గ్రామ సంస్కృతిని గౌరవిస్తూ, మహిళల ఉత్సవాలకు తోడ్పాటునందించిన సర్పంచ్ కమలమ్మ, సంతోష్ పాటిల్ లకు గుర్జాల్ గ్రామ ఆడపడుచులు మరియు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నర్సిములు , సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం