ఆలూరు గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే కాలె యాదయ్య హామీ
రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షల నిధుల మంజూరు
చేవెళ్ల: ఆలూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలోని పలు అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆలూరు గ్రామంలోని అంబేద్కర్ భవన్ మినీ చౌరస్తా నుంచి నూతన రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షల నిధులు మంజూరైనట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని, అర్హులైన పేదలకు 60 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు, విద్యార్థుల రవాణా సౌకర్యార్థం దుద్దాగు బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలని కోరారు. దుద్దాగు నుంచి దేవరంపల్లి వరకు నిర్మించనున్న రోడ్డు పనులకు త్వరలో శంకుస్థాపన చేయాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు. అదేవిధంగా గ్రామంలోని పలు వార్డుల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని విన్నవించారు.
గ్రామస్తులు వివరించిన సమస్యలపై ఎమ్మెల్యే కాలె యాదయ్య సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.
(చేవెళ్ల, మేజర్ న్యూస్)