నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వేడుకలను ప్రారంభించిన హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి
సూర్య మంచిర్యాల టౌన్ : నస్పూర్‌లోని టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి టీఎన్జీవో మంచిర్యాల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం హౌసింగ్ సొసైటీ కాలనీలో బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా కాలనీలోని మహిళలు, సొసైటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ ఐకమత్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. గౌరమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ, కాలనీ మహిళలకు, సభ్యులకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్, కార్యదర్శి కస్తూరి నాగేశ్వర్, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షుడు నడిమెట్ల సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు.కాలనీ మహిళలు, సొసైటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పండుగ వాతావరణంలో కార్యక్రమం కొనసాగింది.