గిరిజన యువతకు పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు రేపటితో ముగింపు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 12): ఆదివాసీ, గిరిజన యువతకు పోలీసు ఉద్యోగాల కోసం అందించే ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె. జనార్దన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్ జిల్లాకు చెందిన అర్హులైన గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.అర్హత కలిగిన అభ్యర్థులు కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం, విద్యార్హత ధ్రువపత్రాలు, పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ప్రతిని జతచేసి తమ దరఖాస్తులను వికారాబాద్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈ నెల 13వ తేదీలోగా సమర్పించాలని కోరారు.ఎంపికైన అభ్యర్థులకు సుమారు రెండు నెలల పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తూ పోలీసు ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ అందించనున్నట్లు జనార్దన్ వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన ఆదివాసీ, గిరిజన యువత గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.