గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు.. ఇద్దరు పాలస్తీనీయులు మృతి
సూర్య అంతర్జాతీయ డెస్క్: గాజా పట్టీలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన తాజా వైమానిక దాడిలో కనీసం ఇద్దరు పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ గాజా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఈ విరుచుకుపడినట్లు స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు మరియు వైద్య సిబ్బంది సోమవారం వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వరుస దాడులు కొనసాగుతుండటంతో గాజాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
సమాచారం ప్రకారం దక్షిణ గాజాలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో సాయుధ ముష్కరుడిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. అయితే ఘటనకు సంబంధించిన తదుపరి వివరాలను ఐడీఎఫ్ బహిర్గతం చేయలేదు. హమాస్ సాయుధ బలగాలు మళ్లీ ఆయుధాలను సమీకరించుకుంటూ దాడులకు తెగబడుతున్నాయని, కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్, ఇటీవలి కాలంలో గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేసింది.
మరోవైపు, తాము ఎలాంటి దాడులకు పాల్పడటం లేదని, తమ ఆయుధ సంపత్తిని పునర్నిర్మించుకునేందుకు ప్రయత్నించడం లేదని హమాస్ ప్రతినిధులు ఈ ఆరోపణలను ఖండించారు. ఇజ్రాయెలే ఉద్దేశపూర్వకంగా గాజా శాంతి ఒప్పందాన్ని భంగపరుస్తోందని ఆరోపించారు. కాగా, గత ఏడాది అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం గాజా పునర్నిర్మాణం జరగాల్సి ఉన్నప్పటికీ, హమాస్ నిరాయుధీకరణ మరియు ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ అంశాలపై పురోగతి లేకపోవడంతో సంక్షోభం కొనసాగుతోంది. గడిచిన ఏడాది కాలంలోనే ఇజ్రాయెల్ దాడుల్లో 1,400 మందికి పైగా పాలస్తీనీయులు మరణించారని గాజా ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు.