నెల రోజుల్లోనే రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం అనంతపురం నగర రూపురేఖలు మార్చడమే లక్ష్యం 20–25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం బ్యూరో : నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, కేవలం నెల రోజుల వ్యవధిలోనే సుమారు రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నగర రూపురేఖలను మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
నగరంలోని పలు డివిజన్లలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. రెండో డివిజన్ పరిధిలోని బిందెల కాలనీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే 9, 10వ డివిజన్ల పరిధిలోని భవానీనగర్‌లో ఆరు సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. 11వ డివిజన్ పరిధిలోని వినాయకనగర్, రాజమ్మ కాలనీల్లోనూ నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగర ప్రజలు గత రెండు నుంచి రెండున్నర దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కేవలం రోడ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా తాగునీరు, డ్రైనేజీ వంటి కీలక మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఓల్డ్ టౌన్‌కు రూ.107 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు
నగరంలోని ఓల్డ్ టౌన్ పరిధిలో ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయి కనెక్షన్ అందించాలనే లక్ష్యంతో రూ.107 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. దీంతో ప్రజలకు ఇంటింటికీ తాగునీటి సౌకర్యం కల్పించేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో రూ.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు గత వారంలోనే అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు.
రెండేళ్లలో రూ.300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు
అనంతపురం నగరంలో గత రెండేళ్ల కాలంలో రూ.300 కోట్లకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సహకారం కీలకమని, ప్రభుత్వ సహకారంతో అనంతపురాన్ని మెరుగైన మౌలిక వసతులు కలిగిన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు.