సంక్షోభంలో రైతులు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి తులసి రెడ్డి
వేంపల్లె మేజర్ న్యూస్:
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కురుకుపోయారని, ప్రభుత్వం వెంటనే వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, అప్పుల ఊబిలో కూరుకుపోయి.. కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉండడం శోచనీయం అన్నారు. ఎల్ నినో ప్రభావ దృష్ట్యా 54 శాతం లోటు వర్షపాతం నెలకొందన్నారు. 388 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలు గా ప్రకటించినట్లు తెలిపారు. ఈ నైపథ్యంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేసి రైతులను అప్పుల ఊబి, ఆత్మహత్యల బారినుండి కాపాడాలని తులసిరెడ్డి కోరారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రమణ్యం, దృవకుమార్ రెడ్డి, రామాంజనేయ రెడ్డి, అమర్, ఉత్తన్న, రవీంద్రారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్. గండికోట షేక్ ఖదీర్,
వేంపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా.