రష్యన్ డీజిల్ దిగుమతుల సడలింపుపై భగ్గుమన్న అమెరికన్ సెనేటర్లు:
సూర్య అంతర్జాతీయ & వాణిజ్య డెస్క్: రష్యా నుంచి డీజిల్ దిగుమతులపై ఆంక్షలను సడలిస్తూ (డీజిల్ వేవర్) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై అమెరికా కాంగ్రెస్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగిస్తున్న వేళ, మాస్కో నుంచి ఇంధన కొనుగోళ్లకు అనుమతించడం పుతిన్ యుద్ధ యంత్రాంగానికి నిధులు సమకూర్చడమేనని డెమొక్రాట్లతో పాటు పలువురు అధికార రిపబ్లికన్ సెనేటర్లు, చట్టసభ సభ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ సహా పలువురు కీలక నేతలు స్పందిస్తూ.. కాంగ్రెస్ ఆమోదించిన కఠిన ఆంక్షల చట్టం స్ఫూర్తిని ట్రంప్ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. అమెరికాలోని సంస్థలు పుతిన్ అందించే ‘రక్తపు డబ్బు’ను స్వీకరించడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని, నిఘా ఉంచుతుందని బ్లూమెంతల్ హెచ్చరించారు. అంతేకాకుండా, రిపబ్లికన్ ప్రతినిధులు మైఖేల్ మెక్‌కాల్, డాన్ బేకన్ తదితరులు సైతం ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ.. దేశీయంగా డీజిల్ ధరలను తగ్గించే నెపంతో రష్యా ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడం గర్హనీయమని పేర్కొన్నారు.
ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, రష్యన్ చమురు కొనుగోళ్లను పూర్తిగా అడ్డుకునేలా చట్టసభలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతినిధుల సభ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికా తీసుకుంటున్న ఈ స్వల్పకాలిక డీజిల్ నిర్ణయం వల్ల అక్కడి మార్కెట్ ధరలపై పెద్దగా ప్రభావం పడకపోగా, శాంతి స్థాపన ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని దౌత్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.