కొడంగల్ నిరసనకు వెళ్లకుండా జిల్లా అధ్యక్షురాలు మంజుల ముందస్తు అరెస్ట్!
బషీరాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు మంజులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఆశా వర్కర్లు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకే పోలీసులు ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న మంజులను బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా పోలీసుల తీరుపై మంజుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరని స్పష్టం చేశారు.ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి ఆందోళనలకు మద్దతుగా నిలుస్తున్న నాయకులను అరెస్టు చేయడం సరికాదని వివిధ సంఘాల నాయకులు విమర్శించారు. మంజులను వెంటనే విడుదల చేయాలని, ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు తీసుకున్న చర్యలపై ప్రజాస్వామ్యవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టర్: కాశీం పాషా, బషీరాబాద్, వికారాబాద్ జిల్లా.