35 కిలోల గంజాయి స్వాధీనం -ఇద్దరుఅరెస్టు
ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో మంగళవారం సాయంత్రం 17.60 లక్షల విలువ చేసే 35 కిలోల గంజాయిని, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మహేశ్వరం డిసిపి నారాయణరెడ్డి తెలిపారు. నిందితులైన ఏపీ పోలవరం జిల్లా రంపచోడవరం మండలం తామర పల్లి గ్రామానికి చెందిన కుంజం చందు బాబు దొర, అదే జిల్లాకు చెందిన దేవిపట్నం మండలం పాముగండి గ్రామానికి చెందిన కోసు వెంకట సాయిబాబు దొర లను అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసి విలేకరుల సమావేశంలో డిసిపి మాట్లాడుతూ ఏపీ రంపచోడవరం ప్రాంతానికి చెందిన గంజాయి డీలర్ అభి ఒక్కొక్కరికి 50,000 అందిస్తానని ఇచ్చిన ఆఫర్ కు అంగీకరించిన నిందితులు రాజమండ్రి మీదుగా ఆమనగల్లుకు చేరుకొని గంజాయిని వ్యక్తికి అప్పగించేందుకు మార్కెట్ యార్డ్ ఆవరణలో వేచి ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాడిలో పాల్గొన్న ఎస్ఓటి అడిషనల్ డిసిపి షేక్ జాంగిర్, ఎస్ఓటి మహేశ్వరం సీఐ రవికుమార్, ఎస్ ఓ టి ఎస్ ఐ సురేష్, ఎస్ఓటి సిబ్బంది, స్థానిక సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై సంతోష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది రజనీకాంత్, రోషణప్ప, శివకుమార్, మల్లయ్య, ఇబ్రహీం లను ఉన్నతాధికారులు అభినందించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎ. చంద్రశేఖర్: మేజర్ న్యూస్, ఆమనగల్లు.