సి జి ఎఫ్ నిధులతో ఆలయాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి-- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : రాష్ట్ర దేవాదాయ శాఖకు సంబంధించిన కామన్ గుడ్ ఫండ్ (సి జి ఎఫ్ ), ధూపదీప నైవేద్య పథకం (డి డి ఎన్ ఎస్ ), గోదావరి పుష్కరాలు–2027 అభివృద్ధి పనులు తదితర అంశాలపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, టీటీడీ జేఈఓ శరత్, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ శేఖర్, తదితర అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో సీజీఎఫ్ కింద మంజూరైన పనులు, పురోగతిలో ఉన్న పనులు, పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు, నిధుల విడుదల, గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులు, డి డి ఎన్ ఎస్ నిధుల విడుదల, ఆలయాల అభివృద్ధి తదితర అంశాలపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.
సి జి ఎఫ్ ప్రతిపాదనలపై సమీక్ష
ప్రస్తుతం సి జి ఎఫ్ కింద 95 పనులకు సంబంధించి 119 కోట్ల మేర అంచనాలను కమిటీ సిఫార్సు చేసింది. ఇందులో సుమారు 28.86 కోట్ల మాన్యువల్ కాంట్రిబ్యూషన్ , 90.11 కోట్ల సి జి ఎఫ్ నిధులు అవసరమవుతున్నట్లు వివరించారు.ఆలయాల అభివృద్ధికి అత్యవసరమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, సీజీఎఫ్ నిధులను సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మంజూరైన పనుల్లో జాప్యం లేకుండా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
గోదావరి పుష్కరాల పనులకు ప్రత్యేక ప్రాధాన్యత
2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్లు, భక్తుల సౌకర్యాలు, పుష్కర ప్రాంతాల్లోని ఆలయాలు, ఆలయ పరిసరాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రస్తుతం గోదావరి పుష్కరాలకు సంబంధించి 412 పనులకు 104.59 కోట్ల మేర పరిపాలనా/అభివృద్ధి నిధులు మంజూరు కాగా, సుమారు 50 కోట్ల విలువైన పనులు ప్రారంభం అయ్యాయి. పనుల మంజూరు, టెండర్లు, నిధుల విడుదల తదితర అంశాల్లో సమన్వయంతో ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, పార్కింగ్, భద్రత, ఆలయ పరిసరాల అభివృద్ధి వంటి అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.
పురోగతిలో ఉన్న సి జి ఎఫ్ పనులు వేగవంతం చేయాలి సి జి ఎఫ్ కింద 466 పనులకు 419.13 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 52.65 కోట్లు విడుదల అయ్యాయని, 366.48 కోట్ల మేర నిధులు విడుదల చేయాల్సి ఉందని అధికారులు వివరించారు.
మరో 427 పనులకు 395.53 కోట్ల మేర ప్రతిపాదనలు ఉండగా, వాటి అమలుకు అవసరమైన తదుపరి చర్యలను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు.
ధూపదీప నైవేద్య పథకంపై ప్రత్యేక సమీక్ష
ఆలయాల్లో ధూపదీప నైవేద్య కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రభుత్వం ఇస్తున్న సహాయంపై కూడా మంత్రి సమీక్షించారు.
ప్రస్తుతం 6,137 ఆలయాల్లో నెలకు 10,000 చొప్పున సహాయం అందుతున్న నేపథ్యంలో, ఈ పథకం కింద ఏటా సుమారు 80 కోట్ల ఆర్థిక అవసరం ఉంటుందని అధికారులు వివరించారు. ఇప్పటివరకు 35.66 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
చిన్న ఆలయాల్లో నిత్య పూజా కార్యక్రమాలు సక్రమంగా కొనసాగేందుకు డి డి ఎన్ ఎస్ నిధులు కీలకమని, అర్హత కలిగిన ఆలయాలకు నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం ఉండకూడదని మంత్రి ఆదేశించారు.
అర్చకులు, ఇతర సిబ్బంది వేతనాలకు సంబంధించిన డిఫరెన్షియల్ రెమ్యునరేషన్ కోసం 20 కోట్ల అవసరం ఉండగా, ఇప్పటివరకు 6.60 కోట్లు విడుదల చేసినట్లు సమావేశంలో వెల్లడించారు.అలాగే జీతాలు, రుణాలు, అడ్వాన్సులు, ప్రింటింగ్–స్టేషనరీ, ప్రయాణం, హైర్ ఛార్జీలు, ట్రిబ్యునల్ ఖర్చులు తదితర ఇతర వ్యయాలకు 6.10 కోట్ల మేర అవసరం ఉండగా, 4.11 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
నిధుల వినియోగంలో ఆర్థిక క్రమశిక్షణ అవసరం దేవాదాయ శాఖకు అందుబాటులో ఉన్న నిధులు, ఇప్పటికే మంజూరైన పనులు, డి డి ఎన్ ఎస్ వంటి నిరంతర వ్యయాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసరమైన, భక్తులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించాలని మంత్రి ఆదేశించారు.
సి జి ఎఫ్ నిధులు భక్తుల సౌకర్యాలు, ఆలయాల అభివృద్ధి, అత్యవసర అవసరాలకు సమర్థవంతంగా వినియోగించాలి. మంజూరైన పనులు వేగంగా పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలి. గోదావరి పుష్కరాలు–2027ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే అన్ని శాఖల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలి అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు సూచించారు.
సమావేశంలో సి జి ఎఫ్ నిధుల కింద చేపట్టిన పనుల పురోగతి, పెండింగ్ ప్రతిపాదనలు, గోదావరి పుష్కరాల పనులు, అర్చకుల వేతనాలు, ఆలయాల మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై అధికారులు మంత్రికి వివరాలు సమర్పించారు