ఉగ్రదాడులకు తగిన ప్రతిస్పందన తప్పదు: మోదీ సర్జికల్ స్ట్రైక్ భారత్ ప్రతిస్పందనకు ఉదాహరణ.. జనగణన జాతీయ బాధ్యత
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 138వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న వైఖరిని ప్రస్తావించారు. ఉగ్రవాదంపై భారత్ శూన్య సహన విధానం అవలంబిస్తోందని స్పష్టం చేశారు. ఉగ్రదాడులకు తగిన ప్రతిస్పందన తప్పదని పేర్కొన్నారు.
భారత్ తనపై జరిగే ఉగ్రదాడులకు ఎలా స్పందిస్తుందో చెప్పేందుకు సర్జికల్ స్ట్రైక్‌ను ఉదాహరణగా మోదీ ప్రస్తావించారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
అదే సమయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన ప్రక్రియను ప్రధాని ప్రస్తావించారు. జనగణన తొలి దశ దాదాపు పూర్తయిందని, ఇప్పటివరకు 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదు చేసినట్లు తెలిపారు. జనగణన దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని మోదీ పేర్కొన్నారు.