నేపాల్‌లో భీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో 24 మంది మృతి
సూర్య అంతర్జాతీయ డెస్క్: హిమాలయ దేశమైన నేపాల్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విలయం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానల కారణంగా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంభవించిన వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలలో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది గల్లంతైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ప్రకృతి విపత్కర పరిస్థితుల కారణంగా మానాంగ్, మ్యాగ్ది, పర్బత్, పాల్పా తదితర జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. భారీ వర్షాల ప్రభావంతో సుమారు 747 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు 143 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవడంతో బాధితులు నిరాశ్రయులయ్యారు. గల్కోట్ ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటికి ఒక ప్రభుత్వ భవనం పూర్తిగా కొట్టుకుపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే ప్రముఖ కాళీగండకి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఇదిలాఉంటే, మానాంగ్ ప్రాంతంలో భారీ వర్షాల మధ్య అకస్మాత్తుగా మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు పర్వతారోహకులు దుర్మరణం పాలైనట్లు సమాచారం. సహాయక చర్యలను ముమ్మరం చేసిన విపత్తు నిర్వహణ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, అత్యవసర సేవలందించేందుకు యంత్రాంగం రంగంలోకి దిగింది.