నా సొంత డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపడమే నేను చేసిన నేరమా? విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు!
సూర్య కార్పొరేట్ డెస్క్: కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల ఎగవేత కేసులో భారత్ నుంచి పారిపోయి లండన్లో తలదాచుకుంటున్న ప్రముఖ మద్యం వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. కర్ణాటక హైకోర్టు వెలువరించిన ఒక కీలక ఉత్తర్వు కాపీని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ, తనను ఇంకా దొంగగా, మోసగాడిగా ఎందుకు చూస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నా సొంత సంపాదనతో రాజభోగాలు అనుభవించి విలాసవంతమైన 'కింగ్ సైజ్' జీవితాన్ని గడపడమే నేను చేసిన అతిపెద్ద నేరమా, దానికి నన్ను ఇంతగా శిక్షిస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ వెలువరించిన తాజా తీర్పులోని ముఖ్యాంశాలను మాల్యా ప్రస్తావించారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల కింద బ్యాంకుల కన్సార్టియంకు చెల్లించాల్సిన అసలు బకాయిలు దాదాపు రూ. 6,203 కోట్లు కాగా, దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు ఇప్పటికే తన ఆస్తులను విక్రయించి ఏకంగా రూ. 14,131.6 కోట్లను రికవరీ చేసుకున్న విషయాన్ని కోర్టు ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నట్లు ఆయన గుర్తుచేశారు. బ్యాంకులు ఇప్పటికే చెల్లించాల్సిన రుణాల కంటే రెట్టింపు మొత్తాన్ని రాబట్టుకున్నాయని, అందువల్ల యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) షేర్లపై బ్యాంకులు మరింతగా హక్కులు కోరడంలో సమర్థన లేదని హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన ఎత్తిచూపారు. రుణం కంటే ఎక్కువ మొత్తం రికవరీ అయినప్పటికీ తనపై ఇంకా క్రిమినల్ అభియోగాలు మోపడం, దొంగగా చిత్రీకరించడం ఎంతవరకు న్యాయమని మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు. "మనందరి పైన దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది" అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే బ్యాంకుల కన్సార్టియం మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వర్గాలు మాత్రం కేవలం ఆస్తుల రికవరీ పూర్తయినంత మాత్రాన పీఎంఎల్ఏ (PMLA) కింద నమోదైన నిధుల మళ్లింపు, మోసం వంటి తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు రద్దు కావని, చట్టపరమైన విచారణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాయి.