చెక్-ఇన్ అయిన 3 గంటలకే విల్లా నుంచి గెంటేసిన వైనం: మేక్‌మైట్రిప్‌కు చండీగఢ్ వినియోగదారుల ఫోరం ₹1.4 లక్షల భారీ జరిమానా!
సూర్య లీగల్ & కన్స్యూమర్ డెస్క్, చండీగఢ్: ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ అగ్రిగేటర్ ‘మేక్‌మైట్రిప్’ (MakeMyTrip - MMT)కు చండీగఢ్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. తాము బుక్ చేసుకున్న విల్లాలోకి ప్రవేశించిన కేవలం మూడు గంటల వ్యవధిలోనే నలుగురు మహిళా పర్యాటకులను బలవంతంగా ఖాళీ చేయించిన కేసులో సంస్థకు రూ. 1.40 లక్షల భారీ జరిమానా విధించింది.
కసౌలీ పర్యటనలో చేదు అనుభవం:
హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలీకి విహారయాత్ర కోసం వెళ్లిన నలుగురు మహిళలు మేక్‌మైట్రిప్ ద్వారా ఒక విల్లాను బుక్ చేసుకున్నారు. అయితే, వారు చెక్-ఇన్ అయిన మూడు గంటలకే విల్లా యజమానులు వారిని బయటకు పంపించివేశారు. తెలియని ప్రదేశంలో మహిళలు ఎదుర్కొన్న తీవ్ర మానసిక ఆందోళన, అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర వినియోగదారుల కమిషన్ గతంలో జిల్లా ఫోరం ఇచ్చిన రూ. 15,000 పరిహారాన్ని భారీగా పెంచింది. బాధితులకు పరిహారంగా రూ. 1.20 లక్షలతో పాటు వ్యాజ్య ఖర్చుల (Litigation costs) కింద మరో రూ. 20,000 కలిపి మొత్తం రూ. 1.40 లక్షలు చెల్లించాలని మేక్‌మైట్రిప్‌ను ఆదేశించింది.
‘మేం కేవలం మధ్యవర్తులమే’ అన్న వాదన తిరస్కరణ:
విచారణ సందర్భంగా మేక్‌మైట్రిప్ తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. తాము కేవలం కస్టమర్లకు, ప్రాపర్టీ యజమానులకు మధ్య బుకింగ్‌లను సమకూర్చే మధ్యవర్తి ప్లాట్‌ఫారమ్ (Intermediary) మాత్రమేనని, విల్లా వద్ద జరిగిన పరిణామాలకు తాము బాధ్యులం కాదని పేర్కొన్నారు. అయితే ఈ వాదనను వినియోగదారుల కమిషన్ తీవ్రంగా తోసిపుచ్చింది. కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తూ సేవలను అందించే ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారుల భద్రత, సేవా లోపం విషయంలో బాధ్యత నుంచి తప్పించుకోలేవని స్పష్టం చేసింది.