పంజాబ్‌లో అమిత్ షా పర్యటన..
సూర్య నేషనల్ & పొలిటికల్ డెస్క్, చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు (మంగళవారం, అక్టోబర్ 20) పంజాబ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల (చిట్టా) అక్రమ రవాణాను, డ్రగ్ పెడ్లర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు పౌరుల కుటుంబాలను ఆయన నేరుగా పరామర్శించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 20 రోజుల వ్యవధిలోనే అమిత్ షా రెండోసారి పంజాబ్‌లో పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
మాన్సా, గురుదాస్‌పూర్, సంగ్రూర్ జిల్లాల్లో పర్యటన:
అమిత్ షా తన పర్యటనలో భాగంగా పంజాబ్‌లోని మూడు ప్రధాన జిల్లాల్లో బాధిత కుటుంబాలను కలవనున్నారు:
మాన్సా జిల్లా అక్టోబర్ 13న డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్విందర్ సింగ్ ఝోటా హత్యకు గురైన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని హోంమంత్రి పరామర్శిస్తారు.
.గురుదాస్‌పూర్ జిల్లా: బటాలా పరిధిలోని మరి పన్వాన్ గ్రామంలో డ్రగ్స్ సరఫరాను వ్యతిరేకిస్తూ దాడికి గురై మరణించిన బిక్రమ్‌జిత్ సింగ్ కుటుంబాన్ని కలుసుకుంటారు.
.సంగ్రూర్ జిల్లా: దిర్బా ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలపై ప్రజావేదికపై గళమెత్తి, అనంతరం బలవన్మరణానికి పాల్పడిన దళిత వ్యక్తి (గుల్జార్ సింగ్) కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెబుతారు.
ఆప్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు:
ఈ పర్యటనకు ముందు కేంద్ర హోంమంత్రి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం పంజాబ్‌ను మత్తు పదార్థాల ఊబిలోకి నెట్టివేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డ్రగ్ మాఫియాపై చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని, నిలదీసిన అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ మూడు కేసులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వానికి లేఖలు రాసింది.
కేంద్రంపై ఆప్ ఎదురుదాడి:
అమిత్ షా విమర్శలను పంజాబ్ పాలకపక్షం ఆప్ తీవ్రంగా తిప్పికొట్టింది. ఎన్నికలు రాగానే బీజేపీ డ్రగ్స్ అంశాన్ని రాజకీయం చేస్తోందని ఆప్ ఆరోపించింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టు ద్వారా దేశంలోకి వేల కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు ఎలా వస్తున్నాయో, వాటిని అడ్డుకోవడంలో కేంద్రం ఎందుకు విఫలమైందో ముందుగా హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. భగవంత్ మాన్ ప్రభుత్వం డ్రగ్స్‌పై 'యుద్ధ్ నశేయాన్ విరుద్ధ్' ఉద్యమాన్ని చేపట్టి ఉక్కుపాదం మోపుతోందని ఆప్ నేతలు స్పష్టం చేశారు.