ఏపీకి వర్షాలు, అల్పపీడన ముప్పు:
రాష్ట్రంలో రానున్న వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలో వాతావరణం మారుతోంది. ఈనెల 24వ తేదీన అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇది క్రమంగా బలపడి ఈనెల 26 తర్వాత వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మరింత బలపడి ఈనెల 29, 30 తేదీల్లో ఉత్తర కోస్తా సమీపంలో తీవ్ర తుఫాన్‌గా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను ప్రభావంతో ఉత్తరకోస్తాంధ్రతో పాటు దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు నేడు ఏపీలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తుఫాను ముప్పు నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.