8000 మీటర్ల ఎత్తున్న మరో ఆరు శిఖరాలకు అంతర్జాతీయ గుర్తింపు కోరిన నేపాల్
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్, ఖాట్మండు: హిమాలయ దేశం నేపాల్ తన పర్వత పర్యాటకం మరియు భౌగోళిక ప్రాధాన్యతను మరింత విస్తరించే దిశగా కీలక ప్రతిపాదనను అంతర్జాతీయ వేదికపై ఉంచింది. దేశంలో 8000 మీటర్లకు పైగా ఎత్తు కలిగిన మరో ఆరు శిఖరాలను ప్రత్యేక పర్వతాలుగా గుర్తించాలని కోరుతూ ఇంటర్నేషనల్ క్లైంబింగ్ అండ్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ (UIAA)కు అధికారికంగా దరఖాస్తు సమర్పించింది. ఖాట్మండులో జరుగుతున్న UIAA జనరల్ అసెంబ్లీలో నేపాల్ పర్యాటక, విమానయాన శాఖ ఈ అంశాన్ని అధికారికంగా లేవనెత్తింది.
కంచెన్‌జంగా మరియు లోట్సే పర్వత శ్రేణుల్లో ఉన్న ఆరు ప్రత్యేక శిఖరాలకు ఈ గుర్తింపు కోరారు. వీటిలో యాలుంగ్ కాంగ్ (8505 మీటర్లు), కంచెన్‌జంగా సౌత్ (8476 మీటర్లు), కంచెన్‌జంగా సెంట్రల్ (8473 మీటర్లు), లోట్సే మిడిల్ (8410 మీటర్లు), లోట్సే శార్ (8400 మీటర్లు), యాలుంగ్ కాంగ్ వెస్ట్ (8077 మీటర్లు) ఉన్నాయి. ఈ శిఖరాల భౌగోళిక గుర్తింపు, విడివిడిగా ఉండే శిఖర అంచులు, ప్రత్యేక పర్వతారోహణ మార్గాలకు సంబంధించిన పూర్తి సాంకేతిక ఆధారాలను సేకరించి నేపాల్ బృందం UIAA ప్రతినిధులకు సమర్పించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 8000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలు 14 ఉండగా, వాటిలో ఎవరెస్ట్ సహా 8 శిఖరాలు నేపాల్ పరిధిలోనే ఉన్నాయి. నేపాల్ ప్రతిపాదించిన ఈ ఆరు శిఖరాలకు UIAA ఆమోదం లభిస్తే ప్రపంచంలో 8000 మీటర్ల పర్వతాల సంఖ్య 14 నుంచి 20కి, నేపాల్‌లోని పర్వతాల సంఖ్య 8 నుంచి 14కి పెరుగుతుంది. అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 20 పర్వతాల్లో ఏకంగా 14 శిఖరాలు ఒక్క నేపాల్‌లోనే కొలువుదీరిన రికార్డు ఆ దేశానికి దక్కుతుంది.
ఈ గుర్తింపు కేవలం శిఖరాల సంఖ్యను పెంచడం మాత్రమే కాదని, హిమాలయ భౌగోళిక వారసత్వాన్ని శాస్త్రీయంగా ప్రపంచానికి చాటిచెప్పడమేనని నేపాల్ పర్యాటక శాఖ మంత్రి ఖడ్గరాజ్ పౌడెల్ స్పష్టం చేశారు. దీనివల్ల దేశంలో అడ్వెంచర్ టూరిజం, అంతర్జాతీయ పర్వతారోహకుల తాకిడి, పర్వత ఆధారిత ఆర్థిక వ్యవస్థ మరియు పరిశోధనలకు సరికొత్త ద్వారాలు తెరుచుకుంటాయని వివరించారు.