కాశ్మీరీల తరఫున మాట్లాడిన బ్రిటిష్ కౌన్సిలర్ దాలత్ అలీని అడ్డుకున్న పాక్
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాక్ ప్రజల హక్కుల కోసం గళమెత్తిన బ్రిటిష్ లేబర్ పార్టీ కౌన్సిలర్, రోచ్‌డేల్ బరో డిప్యూటీ లీడర్ దాలత్ అలీని పాకిస్థాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ మధ్యలో అధికారిక ప్రతినిధి బృందంతో కలిసి పాకిస్థాన్ వచ్చిన ఆయన్ను విమానాశ్రయంలో గంటల తరబడి విచారించడమే కాకుండా, తిరిగి బ్రిటన్ వెళ్లకుండా లాహోర్ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ఆయన పేరును ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) కంట్రోల్ లిస్టులో చేర్చినట్లు ఇమిగ్రేషన్ అధికారులు వెల్లడించారు.
అధికారిక పర్యటనలో అడ్డంకులు:
రోచ్‌డేల్ మేయర్ ఫైసల్ రాణా నేతృత్వంలోని పౌర ప్రతినిధి బృందంతో కలిసి దాలత్ అలీ పంజాబ్‌లోని సాహివాల్ నగర పర్యటనకు వెళ్లారు. అయితే, ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించారు. బ్రిటిష్ అధికారుల జోక్యంతో తాత్కాలికంగా విడుదలైనప్పటికీ, అక్టోబర్ 28న లాహోర్ నుంచి లండన్ తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా విమానం ఎక్కకుండా నిలిపివేశారు. రోచ్‌డేల్ కౌన్సిల్ ప్రకటన విడుదల చేస్తూ, కాశ్మీర్ ప్రాంతంపై ఆయనకున్న దీర్ఘకాలిక వ్యక్తిగత వైఖరి మరియు ఉద్యమ నేపథ్యం కారణంగానే ఈ వేధింపులు చోటుచేసుకున్నట్లు పేర్కొంది.
పాక్ పరిస్థితులపై గళం – బ్రిటన్ ఎంపీ ఆగ్రహం:
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి ప్రాంతానికి చెందిన దాలత్ అలీ, రచయితగా మరియు సినీ నిర్మాతగా సుపరిచితులు. తన రచనల్లో పాకిస్థాన్‌ను ఆక్రమణదారుగా అభివర్ణించిన ఆయన, కాశ్మీరీల పౌర హక్కుల కోసం నిరంతరం గళం వినిపిస్తున్నారు. ప్రస్తుతం PoKలో విద్యుత్ చార్జీలు, పిండి ధరలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ ఘటన కలకలం రేపింది. దాలత్ అలీని నిర్బంధించడంపై బ్రిటన్ ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డారు. ఈ అంశంలో తక్షణమే జోక్యం చేసుకుని ఆయన్ను సురక్షితంగా యూకేకు రప్పించాలని బ్రిటిష్ విదేశాంగ శాఖను కోరారు.