నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా?
సూర్య అంతర్జాతీయ డెస్క్: అమెరికా రాజకీయాల్లో నార్త్ కరోలినా రాష్ట్రం ఎప్పుడూ ఆసక్తికర పోరుకు వేదికగా నిలుస్తుంది. అక్కడ డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు, మాజీ గవర్నర్ రాయ్ కూపర్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం (ప్లేబుక్) విజయవంతంగా కొసాగుతుండటంతో ఇతర రాష్ట్రాల డెమొక్రాట్ నాయకులు కూడా దీనిని కాపీ చేసే అవకాశముందా అనే చర్చ అంతర్జాతీయ స్థాయిలో ఊపందుకుంది. సాధారణంగా రిపబ్లికన్ల వైపే ఎక్కువ మొగ్గు చూపే నార్త్ కరోలినా వంటి 'స్వింగ్ స్టేట్'లో వరుసగా ఎన్నికల్లో విజయం సాధిస్తూ ప్రజాదరణ కాపాడుకోవడం వెనుక రాయ్ కూపర్ అనుసరించిన సమతుల్య విధానాలు, ఆరోగ్య సంరక్షణ రాజకీయాలు కీలక పాత్ర పోషించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాయ్ కూపర్ గతంలో గవర్నర్గా ఉన్న సమయంలో స్థానిక హెల్త్కేర్, మెడికేడ్ విస్తరణ, ఆర్థికాభివృద్ధి అంశాలపై ఎక్కువ దృష్టి సారించారు. ప్రత్యర్థులపై విమర్శల కంటే ప్రజలకు అవసరమైన ప్రాథమిక సేవలను అందించడమే ఆయన్ను ప్రజలకు దగ్గర చేసింది. ముఖ్యంగా రిపబ్లికన్ల విధానాల వల్ల కలిగే హెల్త్కేర్ కోతలను, ప్రీమియం పెంపులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ తరహా విధానాలతోనే ఆయన రిపబ్లికన్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సైతం మధ్యస్థ ఓటర్లను, స్వతంత్ర అభ్యర్థుల మద్దతును పొందగలిగారు.
అమెరికా సెనెట్ ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధించడం సవాలుగా మారిన ప్రస్తుత తరుణంలో, కూపర్ నమూనా ఇతర దక్షిణ రాష్ట్రాల డెమొక్రాట్లకు మార్గదర్శకంగా మారుతోంది. తీవ్రవాద భావజాలానికి దూరంగా ఉంటూ, మితిమీరిన రాజకీయ విభజనలు లేకుండా ప్రజా సంక్షేమం మరియు ప్రాంతీయ సమస్యలపై దృష్టి పెట్టడమే ఈ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, వేర్వేరు రాష్ట్రాల ఓటర్ల ప్రవర్తన, అక్కడి స్థానిక అంశాలు వేర్వేరుగా ఉండటంతో ఈ నమూనా అన్ని ప్రాంతాల్లోనూ సమాన ఫలితాలను ఇస్తుందా లేదా అనేది రాబోయే అమెరికా ఎన్నికల ఫలితాలే నిర్ణయించనున్నాయి.