అమెరికా-రష్యా చర్చల్లో కోట్ల డొల్లర్ల భారీ చమురు ఒప్పందం
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా మరియు రష్యా దేశాల మధ్య జరుగుతున్న దౌత్య చర్చలు సరికొత్త మలుపు తిరిగాయి. ఈ శాంతి చర్చల పరిధిని మరింత విస్తృతం చేస్తూ ఇరు దేశాల మధ్య పలు బిలియన్ డాలర్ల విలువైన భారీ చమురు ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకూల వర్గాలు మరియు దౌత్య రాయబారుల ప్రమేయంతో ఈ ఇంధన ఒప్పంద చర్చలు జోరందుకున్నాయి. రష్యాకు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ లూకోయిల్ కు సంబంధించిన అంతర్జాతీయ చమురు క్షేత్రాలు, రిఫైనరీలు మరియు పెట్రోల్ బంకులను లక్ష్యంగా చేసుకుని ఈ భారీ వాణిజ్య ఒప్పందం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది.
అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్ మరియు జారెడ్ కుష్నర్ లతో ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జరిపిన రహస్య భేటీలో ఈ చమురు వ్యాపార ఒప్పందం ప్రధానాంశంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. రష్యా మరియు అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవచ్చనే సంకేతాలను అందించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని పుతిన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం మరియు రష్యా క్రెమ్లిన్ నుండి అధికారిక ఆమోదం లభిస్తేనే అమల్లోకి రానున్న ఈ ఒప్పందంపై అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింపుకు తీసుకురావడంతో పాటు ఆర్థిక మరియు వ్యాపార ప్రయోజనాలను ముడిపెడుతూ ఈ చర్చలు సాగుతుండటం గ్లోబల్ మార్కెట్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఈ భారీ ఒప్పందం వెనుక అమెరికా ప్రభుత్వ అధికారులకు మరియు ప్రైవేట్ ఇన్వెస్టర్లకు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలపై కొన్ని వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్లు మరియు అమెరికన్ పెట్టుబడిదారులు ఈ డీల్‌లో భాగస్వాములుగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఈ పరిణామాలపై రష్యా మరియు అమెరికా ప్రభుత్వ అధికారిక వర్గాలు ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఉక్రెయిన్ శాంతి చర్చలు కేవలం రాజకీయ ఒప్పదాలకే పరిమితం కాకుండా ఇంధన వ్యాపార లావాదేవీల వైపు మళ్లడం రాబోయే కాలంలో ఎలాంటి భౌగోళిక రాజకీయ మార్పులకు దారితీస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.