సౌదీ అరేబియా రియాద్‌లోని ఆరామ్‌కో ఆవరణ సమీపంలో దట్టమైన పొగలు, అగ్నిప్రమాదం
సూర్య అంతర్జాతీయ డెస్క్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రపంచ ప్రసిద్ధ చమురు దిగ్గజం 'సౌదీ ఆరామ్‌కో' (Saudi Aramco) సంస్థకు చెందిన రిఫైనరీ మరియు కీలక సౌకర్యాల సమీపంలో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నట్లు స్థానిక ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. రియాద్‌లోని కీలకమైన చమురు ప్రాంగణ ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు అంతర్జాతీయ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
అధికారులు మరియు ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, రియాద్‌లోని ఆరామ్‌కో పెట్రోలియం సౌకర్యాల వైపు నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అయితే ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఏమిటనే దానిపై ఇప్పటివరకు సౌదీ అధికారిక వర్గాల నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. గత కొంతకాలంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు యెమెన్ సరిహద్దు ప్రాంతాల నుంచి ఎదురవుతున్న డ్రోన్, క్షిపణి ముప్పుల నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మరియు భద్రతా బలగాలు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముమ్మర చర్యలు చేపట్టాయి.
ఈ ఘటనపై సౌదీ అరేబియా ప్రభుత్వం లేదా ఆరామ్‌కో యాజమాన్యం అధికారికంగా ప్రకటన విడుదల చేయనప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా నిఘాను మరింత కఠినతరం చేశారు. వ్యూహాత్మక ఇంధన కేంద్రాల వద్ద భద్రతా ప్రమాణాలను అత్యున్నత స్థాయికి చేర్చినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన ఆరామ్‌కో కేంద్రాల వద్ద ఇలాంటి అగ్నిప్రమాదాలు లేదా దాడుల సంకేతాలు వెలువడడం అంతర్జాతీయంగా ముడిచెమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.