ఐయూ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఐరోపా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన రష్యా
సూర్య అంతర్జాతీయ డెస్క్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరగనున్న యూరోపియన్ యూనియన్ (EU) శిఖరాగ్ర సమావేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ హాజరవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐరోపా దేశాలకు బిగ్ షాక్ ఇచ్చారు. ఐరోపా సమాఖ్యలోని పలు ప్రముఖ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీల స్థానిక ఆస్తులను తాత్కాలికంగా తమ ప్రభుత్వ నియంత్రణలోకి (Temporary Management) తెస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. ఉక్రెయిన్‌కు ఐరోపా సమాఖ్య నిరంతరం అందిస్తున్న సైనిక, ఆర్థిక మద్దతుకు నిరసనగా ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి.
తాజా ఉత్తర్వుల ప్రకారం ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఫ్లోరింగ్ తయారీ సంస్థ తార్కెట్ (Tarkett), జర్మనీ ప్యాకేజింగ్ సంస్థ మెంషెన్ (Menshen), స్వీడన్‌కు చెందిన స్వెరిగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ మరియు నెదర్లాండ్స్‌కు చెందిన ప్యాకేజింగ్ దిగ్గజం సోనోకో (Sonoco) కంపెనీల రష్యాలోని ఆస్తులను రష్యా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అంతకుముందు గత నెలలో అంతర్జాతీయ ఆహార దిగ్గజం నెస్లే (Nestle), ప్రముఖ రిటైల్ సంస్థలు ఆచాన్ (Auchan) మరియు మెట్రో (Metro) కంపెనీల ఆస్తులను కూడా రష్యా ఇదే రీతిలో తమ ఆధీనంలోకి తీసుకుంది. ఐరోపా దేశాలు రష్యా పట్ల వహిస్తున్న శత్రుత్వ వైఖరికి ఇది సరైన సమాధానమని, అయితే పరిస్థితులు అనుకూలిస్తే ఈ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం ఉందని రష్యా స్పష్టం చేసింది.
యురోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశంలో జెలెన్స్కీ పాల్గొని ఐరోపా దేశాల నుంచి మరింత వైమానిక రక్షణ మరియు ఆర్థిక సహాయాన్ని కోరనున్నారు. మరోవైపు ఐరోపాలో స్తంభింపజేసిన రష్యా ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకుని ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఉపయోగించాలని అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు భావిస్తున్న తరుణంలో, పుతిన్ చేపట్టిన ఈ ప్రతిచర్యల వల్ల అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాలో మిగిలి ఉన్న మిగతా పాశ్చాత్య కంపెనీల భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.