శాంతి భద్రతలపై భారత్కు అత్యధిక బాధ్యత: ఐరాస భద్రతా మండలిలో భారత రాయబారి పర్వతనేని హరీశ్ స్పష్టం!
సూర్య గ్లోబల్ డెస్క్: పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు, ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో మధ్యప్రాచ్య పరిస్థితులపై జరిగిన యుఎన్ఎస్సీ ఓపెన్ డిబేట్లో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ప్రసంగిస్తూ, ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వం కాపాడటంలో భారత్కు అత్యున్నత ప్రయోజనాలు, ప్రత్యక్ష బాధ్యత ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. గల్ఫ్ సహకార మండలి దేశాల్లోనే ఏకంగా ఒక కోటి (10 మిలియన్లు) మందికి పైగా భారతీయ పౌరులు నివసిస్తున్న విషయాన్ని ఆయన ప్రపంచ దేశాలకు గుర్తుచేశారు.
కోటి మంది భారతీయుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత:
పశ్చిమాసియాలో శాంతి కేవలం రాజకీయ పరమైన అంశం మాత్రమే కాదని, అది లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నదని పర్వతనేని హరీశ్ పేర్కొన్నారు. "మధ్యప్రాచ్యంలో శాంతి, భద్రత, సుస్థిరత నెలకొనడంలో భారత్కు అత్యంత కీలకమైన వాటా ఉంది. గల్ఫ్ ప్రాంతంలో కోటి మందికి పైగా భారతీయులు పనిచేస్తూ, నివసిస్తున్నారు. అందువల్ల ఆ ప్రాంత శాంతి భద్రతలు మా దేశ జాతీయ ప్రయోజనాలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్నాయి" అని స్పష్టం చేశారు. యుద్ధ వాతావరణం మరింత ముదిరితే అది వలస కార్మికులు, ప్రవాసుల భద్రతకే కాకుండా మొత్తం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.
పౌర మౌలిక వసతులు, నౌకలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం:
విమానాశ్రయాలు, సాధారణ నివాస ప్రాంతాలు, విద్యాసంస్థలు వంటి పౌర మౌలిక సదుపాయాలే లక్ష్యంగా సాగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు. ఇటీవల సౌదీ అరేబియా విమానాశ్రయాలు, పరిసర ప్రాంతాలపై జరిగిన వైమానిక దాడుల్లో భారత పౌరుడు మహమ్మద్ యూసుఫ్ అలీ మరణించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ వాణిజ్య నౌకలు, సముద్ర మార్గాలు మరియు నావికులపై దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమని, హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల భద్రతకు విఘాతం కలగకుండా తక్షణమే ఈ దాడులు ఆగిపోవాలని డిమాండ్ చేశారు.
యూఎన్ శాంతి పరిరక్షకుల భద్రత తప్పనిసరి:
లెబనాన్ సరిహద్దుల్లో మోహరించిన ఐరాస తాత్కాలిక బలగాలు పై జరుగుతున్న దాడులను భారత్ గట్టిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ శాంతి కోసం పనిచేసే యూఎన్ శాంతి పరిరక్షకులు ఎట్టిపరిస్థితుల్లోనూ దాడులకు గురికాకూడదని, యూఎన్ ప్రాంగణాల పవిత్రతను, గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు.
చర్చలు, దౌత్యమే ఏకైక మార్గం – టూ-స్టేట్ సొల్యూషన్కు కట్టుబడి ఉన్నాం:
యుద్ధం ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేదని, తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని భారత్ పునరుద్ఘాటించింది. గాజాలోని బాధితులకు మానవతా సాయం నిరంతరాయంగా అందేలా చూడాలని కోరారు. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య దశాబ్దాల వివాదానికి ఆమోదయోగ్యమైన చర్చల ద్వారా ద్వైపాక్షిక "టూ-స్టేట్ సొల్యూషన్" సాధించడమే శాశ్వత శాంతికి మార్గమని పర్వతనేని హరీశ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం సమన్వయంతో వ్యవహరించి మరింత ప్రాణనష్టం జరగకుండా సంయమనం పాటించాలని భారత్ తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు.