బలప్రయోగం చేస్తామంటూ చైనా రాయిబారి పరోక్ష బెదిరింపులు
సూర్య అంతర్జాతీయ డెస్క్: దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఫిలిప్పీన్స్లో పనిచేస్తున్న చైనా రాయబారి జింగ్ క్వాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అత్యంత ఘాటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడితే చైనా చాలా సులభంగా సైనిక బలప్రయోగం ద్వారా విజయం సాధించగలదని, అయితే తాము శాంతిని కోరుకుంటున్నామని చైనా రాయబారి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను సైనిక బలప్రయోగం చేస్తామంటూ తీవ్రంగా పరోక్షంగా బెదిరించడమేనని అభివర్ణించిన ఫిలిప్పీన్స్, చైనా రాయబారి పదజాలాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
మనీలాలో జరిగిన ఒక కార్యక్రమంలో చైనా రాయబారి జింగ్ క్వాన్ మాట్లాడుతూ, ఫిలిప్పీన్స్ రక్షణ కార్యదర్శి గిల్బెర్టో టియోడోరో చైనాను ప్రాంతీయ సమస్యల సృష్టికర్తగా వర్ణించడాన్ని తీవ్రంగా ఖండించారు. చైనా వంటి మంచి పొరుగు దేశం లభించినందుకు ఫిలిప్పీన్స్ అదృష్టవంతిగా భావించాలని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఇరు దేశాల మధ్య సవాళ్లు ఎదురై బలప్రయోగానికి దిగితే చైనానే గెలుస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మనీలా ప్రభుత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఇరు దేశాల సంబంధాలను మరింత దెబ్బతీసేలా రాయబారి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని ఫిలిప్పీన్స్ మండిపడింది.
రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్న తరుణంలో చైనా ప్రతినిధి బెదిరింపు ధోరణిలో మాట్లాడటం ఏమాత్రం సహేతుకం కాదని ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాలను, సముద్ర తీర్మానాలను గౌరవించకుండా చైనా పదేపదే బలప్రదర్శనకు దిగడాన్ని ఖండిస్తున్నట్లు తెరిపింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏకపక్షంగా ప్రవర్తిస్తూ ఫిలిప్పీన్స్ నౌకలు, మత్స్యకారులపై ఒత్తిడి తీసుకురావడంపై అంతర్జాతీయ వేదికలపై కూడా నిరసన తెలుపుతామని ఫిలిప్పీన్స్ హెచ్చరించింది.