చిన్న గుర్రాయిగూడెంలో వైభవంగా కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులతో కిటకిటలాడుతున్న అమ్మవారి ఆలయం
టి. నరసాపురం, సూర్య న్యూస్:ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం చిన్న గుర్రాయిగూడెం గ్రామంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 11వ తేదీ ఆదివారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు అక్టోబర్ 22వ తేదీ గురువారం వరకు 12 రోజులపాటు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి శ్రీ సరస్వతీ దేవి అలంకారం నిర్వహించారు.
ఉదయం 9 గంటల నుంచి విద్యార్థినీ, విద్యార్థులతో ప్రత్యేక సామూహిక పూజా కార్యక్రమాలు చేపట్టారు. చిన్నారులకు సరస్వతీ పూజ నిర్వహించడంతో పాటు అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిపించారు. విద్యార్థులు విద్యాబుద్ధులు, జ్ఞానసంపదతో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.
వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు
ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 17న శనివారం శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటల నుంచి మహిళలకు వినోదభరిత పోటీలు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 18న ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవి అలంకారం, ఉదయం 11 గంటల నుంచి భోజనాలు, మహా నైవేద్య సమర్పణ, రాత్రి మహిళలచే అమ్మవారి సేవ నిర్వహించనున్నారు.
అక్టోబర్ 19న సోమవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం నిర్వహించి, రాత్రి బహుమతుల ప్రదాన కార్యక్రమం చేపట్టనున్నారు. అక్టోబర్ 20న మంగళవారం విజయదశమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి శమీ పూజ, మూలమంత్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి.
అక్టోబర్ 21న బుధవారం ఉదయం 11 గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు నిర్వహించనుండగా, అక్టోబర్ 22న గురువారం అఖండ అన్నసమారాధనతో ఉత్సవాలను ముగించనున్నారు.
ఎస్ఐ ఎం. జయబాబు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు
దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. టి. నరసాపురం ఎస్ఐ ఎం. జయబాబు నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కనకదుర్గ అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కోరారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు