లాయర్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణురాలను కాలేదు...వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియా
సూర్య అంతర్జాతీయ డెస్క్: అమెరికా వైట్‌హౌస్ నూతన ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన కేటీ జకారియా (Katie Zacharia) తన న్యాయవాద వృత్తి అర్హతలకు సంబంధించిన వివాదంపై ఎట్టకేలకు నోరు విప్పారు. తాను లాయర్ అర్హత పరీక్ష అయిన 'బార్ ఎగ్జామ్' (Bar Exam) లో ఉత్తీర్ణత సాధించలేదని ఆమె బహిరంగంగా అంగీకరించారు. గత కొన్ని రోజులుగా ఆమె న్యాయవాది లైసెన్స్ మరియు విద్యార్హతలపై తీవ్ర స్థాయిలో ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో, ఫాక్స్ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జకారియా ఈ సంచలన విషయాన్ని ధృవీకరించారు.
పెప్పర్డైన్ విశ్వవిద్యాలయం నుంచి లాయ్ డిగ్రీ పూర్తి చేసిన కేటీ జకారియా, కాలిఫోర్నియా రాష్ట్రంలో బార్ ఎగ్జామ్ రాసినప్పటికీ అందులో ఉత్తీర్ణురాలు కాలేదని తెలిపారు. ఆ సమయంలో తన వివాహ ఏర్పాట్లు మరియు భర్త ఉద్యోగ రీత్యా చైనాకు నివాసం మార్చే పనుల్లో బిజీగా ఉండటం వల్లే పరీక్షపై దృష్టి పెట్టలేకపోయానని సమర్థించుకున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత రెండోసారి కూడా తాను ఈ పరీక్ష రాయలేదని స్పష్టం చేశారు. దాంతో అమెరికాలోని ఏ రాష్ట్రంలోనూ ఆమెకు లాయర్‌గా ప్రాక్టీస్ చేయడానికి చట్టబద్ధమైన లైసెన్స్ లేదు.
గతంలో తాను కార్పొరేట్ లాయర్‌గా పనిచేశానని, ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సైతం ఆమెను 'అటోర్నీ' అని వర్ణించడం వల్ల ఈ అర్హతల వివాదం మొదలైంది. ఇటీవల విలేకరులు ఆమెను ఎక్కడ బార్ ఎగ్జామ్ పాస్ అయ్యారని ప్రశ్నించగా "తాను చైనా వెళ్లాను" అని దాటవేసేలా సమాధానమివ్వడం విమర్శలకు దారితీసింది. అయితే ప్రెస్ సెక్రటరీ పదవికి లాయర్ లైసెన్స్ తప్పనిసరి కాకపోయినప్పటికీ, తనను తాను లాయర్‌గా చెప్పుకోవడం ద్వారా కేటీ జకారియా బాధ్యతారహితంగా వ్యవహరించారంటూ విపక్షాలు, మీడియా వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.