ఎండ వెలుతురు.. పౌష్టికాహారం.. ఆటపాటలతో పిల్లల ఎముకలకు బలం!
మొబైల్‌కు దూరంగా.. మైదానాలకు దగ్గరగా ఉండాలి
విటమిన్-డి లోపంతో ఎముకల ఎదుగుదలకు ఆటంకం: డా. రోషన్ కుమార్ జైస్వాల్
హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి :పిల్లల్లో ఎముకలు దృఢంగా ఎదగాలంటే తగినంత సూర్యరశ్మి, సమతుల ఆహారం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ అవసరమని కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, కాంప్లెక్స్ ట్రామా సర్జరీ నిపుణుడు డా. రోషన్ కుమార్ జైస్వాల్ సూచించారు. మొబైల్ ఫోన్లు, టీవీలకు పరిమితమవుతున్న పిల్లలను ఆరుబయట ఆటలవైపు ప్రోత్సహించాలని ప్రపంచ బాలల ఎముకల ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. విటమిన్-డి లోపం వల్ల శరీరంలో కాల్షియం శోషణ తగ్గి ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉందన్నారు. తీవ్రమైన లోపం చిన్నారుల్లో రికెట్స్‌కు దారితీయవచ్చని, ఎదుగుదల మందగించడం, ఎముకలు, కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు.
పిల్లలు ప్రతిరోజూ వయసుకు తగిన ఆటలు, సైక్లింగ్, పరుగు వంటి శారీరక కార్యకలాపాల్లో పాల్గొనేలా చూడాలన్నారు. పాలు, పెరుగు, జున్ను, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలతో కూడిన సమతుల ఆహారం అందించాలని సూచించారు. వైద్యుల సలహా లేకుండా విటమిన్-డి సప్లిమెంట్లను అధిక మోతాదులో ఇవ్వకూడదని స్పష్టం చేశారు.చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చడం ద్వారా పిల్లల ఎముకలు, కండరాలు దృఢంగా ఎదుగుతాయని, వారి భవిష్యత్తు ఆరోగ్యానికి తల్లిదండ్రులు పునాది వేయాలని డా. రోషన్ కుమార్ జైస్వాల్ పేర్కొన్నారు.