యూసఫ్‌గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు హంస ఆకారంలో 18 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు
వెంగళరావునగర్, మేజర్ న్యూస్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణకాంత్ పార్కు వద్ద ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవీన్ యాదవ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో హంస ఆకారంలో 18 అడుగుల భారీ బతుకమ్మను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పూల అలంకరణలతో తీర్చిదిద్దిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలతో పార్కు పరిసరాలు కోలాహలంగా మారాయి.
బతుకమ్మల నిమజ్జనం కోసం యూసఫ్‌గూడ సర్కిల్-38 ఉప కమిషనర్ సురేష్ ఆధ్వర్యంలో కృష్ణకాంత్ పార్కు ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా తాత్కాలికంగా నీటి కొలనును ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సతీమణి వర్షా యాదవ్, సోదరుడు వెంకట్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిరెడ్డి నాగార్జునరెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.