చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 6 ఆజ్ఞాచక్రంలో అమ్మవారి ఆజ్ఞ - కాత్యాయనీ దర్శనం (అంతర్ దృష్టికి, అంతర్గత జ్ఞానానికి ప్రతీక)
చక్రయాత్ర - నవదుర్గ దర్శనం - 6
ఆజ్ఞాచక్రంలో అమ్మవారి ఆజ్ఞ - కాత్యాయనీ దర్శనం
(అంతర్ దృష్టికి, అంతర్గత జ్ఞానానికి ప్రతీక)
**********************************
:కాత్యాయనీ ధ్యాన శ్లోకం:
చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా!
కాత్యాయనీ శుభం దద్యాద్దేవి దానవఘాతినీ!!
ఈ శ్లోక భావం చంద్రహాసం (కత్తి) ప్రకాశిస్తున్నట్లుగా, పులిని వాహనంగా కలిగిన కాత్యాయినీ దేవిని స్తుతిస్తూ, శుభాలను ప్రసాదించి, రాక్షసులను సంహరించే దేవత పేర్కొంటోంది.
నవరాత్రులలో ఆరవరోజు దుర్గాదేవి కాత్యాయనిగా పూజలందుకుంటుంది.
:పాలక గ్రహం: బృహస్పతి గ్రహం కాత్యాయని దేవిచే పరిపాలించ బడుతుందని నమ్ముతారు.
:కాత్యాయనీ దేవి ఇష్టమైన పువ్వు: ఎరుపు రంగు పువ్వులు ప్రత్యేకంగా గులాబి
:కాత్యాయనీ దేవి మంత్రం: దేవ్యై కాత్యాయన్యైనమః
:కాత్యాయనీ దేవి రూపం వర్ణన:
కాత్యాయనీమాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను. కాత్యాయనీ దేవి అత్యంత ఫలదాయిని. కృష్ణ భగవానునికై గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి.
బంగారు వర్ణము నాలుగు భుజములతో ఈమె దివ్య స్వరూపము ఉంటుంది. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదాని యందు ఖడ్గము, వేరొకదాని యందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన. ఈ కాత్యాయనీ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధ కామ మోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభ్యమై, జన్మజన్మాంతర పాపములు నశించును. రోగశోక సంతాప భయములు దూరమగును.
:పురాణ గాథ:
యజుర్వేదంలోని త్రైతీయ అరణ్యకము లో మొట్టమొదటే ఈ ఆమ్మవారి ప్రస్తావన వస్తుంది. స్కంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన ఈ అమ్మవారు మహిషాసుర సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది. నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని భారతదేశ మంతటా పూజిస్తారు. కాత్యాయనీ దేవి అజ్ఞాచక్రానికి అధిష్ఠాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుంది. అమరకోశం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయనీ. శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి, దుర్గ, భద్రకాళి, చండికల అపర అవతారంగా భావిస్తారు. ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయనీదేవి గురించి ప్రస్తావస్తూ ఓడిశా ప్రదేశం జగన్నాధునికీ, కాత్యాయనీ దేవికి పీట వంటిది అని వివరించారు. మార్కండేయ పురాణం, దేవి భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు. పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయనీ అమ్మవారిని దుర్గదేవిగా వర్ణించారు.
:కాత్యాయనీ దేవి ప్రాముక్యత:
జీవితంలో వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగించే దేవత. మంగళ దోషాలను సైతం ఆమె తొలగిస్తుందని చెప్పబడింది. కాత్యాయనీ దేవిని పూజించబడే ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలుగుతుంది. వైవాహిక సమస్యలు ఉన్నవారు కాత్యాయనీ దేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందగలరని, వివాహ విషయాలలో ఆలస్యం, భార్యాభర్తల విభేదాలు, సరైన భాగస్వామిని ప్రయత్నాలు వంటి సమస్యలు నవరాత్రి వేళల్లో ఆమెకై ప్రార్ధించుట ద్వారా తొలగించ బడుతుందని చెప్పబడింది. ఆమె వర్ణనలు కాళిక పురాణాలలో కూడా కనిపిస్తాయి. కాత్యాయనీ దేవి కూడా ఆదిశక్తి అంశగా పరిగణించబడుతుంది. కావున భయాన్ని త్యజించడం కోసం కూడా కాత్యాయనీ దేవిని పూజిస్తారు. భాగవతపురాణంలో గోకులంలోని గోపికలు, కృష్ణుని ప్రేమను పొందుటకై ఈ దేవతకు ప్రార్ధనలు చేసేరు. యమునా నదిలో స్నానం చేసి, ధూప దీపాలతో, పువ్వులు మరియు నైవేద్యాలను సమర్పించి ఉపవాసం చేసేవారని చెప్పబడింది. ఈ ఉపవాసాలు చేయడం ద్వారా, క్రమంగా దోషాలు తొలగిపోయి వివాహ మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పబడింది. దేవీ నవ రాత్రులలో కాత్యాయని దేవీని పూజ చేయడం వివాహాది సమస్యలతో భాదపడేవారికి అనుకూలం అంటారు పెద్దలు. కాత్యాయని వ్రతాన్ని ముఖ్యం గా కన్యలు,పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొనే వారు, వివాహము సమస్యలున్నవారు,ఈ వ్రతాన్నిఅనుసరించవచ్చు.దేవినవరాత్రులు కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును.
:కాత్యాయనీ దేవి దేవాలయములు:
న్యూఢిల్లీ కి సమీపంలో ఛత్రపూర్ దగ్గరగా భారతదేశంలో అతిపెద్ద ఆలయ సముదాయం అని కూడ నివేదించబడింది. ప్రధాన ఆలయం మా కాత్యాయని దేవి కి అంకితం చేయబడింది మరియు చక్కగా చెక్కిన పాలరాయి గోడలు మరియు ఇతర రాళ్లతో అందంగా నిర్మించబడింది. ఈ ఆలయంలో మతపరమైన కార్యక్రమాలకు పెద్ద హాల్ ఉంది. ప్రధాన ఆలయం పక్కన, దీనిని హనుమాన్జీ యొక్క పెద్ద విగ్రహం మరియు కాంప్లెక్స్ లోపల స్వామి రాంపాల్ జీ వ్యవస్థాపకుడి సమాధి ఉన్న ఆలయ సముదాయం అనిపిలుస్తారు. మతపరమైన వ్యక్తులకు మరియు భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చే పర్యాటకులకు అద్భుతమైన ప్రదేశం. మరపురాని అనుభవం. ఈస్థలంలో నవరాత్రి ఘనంగా జరుగుతుంది. అత్యంత ప్రసిద్ధ ఆలయం జైత్పురాలో వారణాసిలో ఉంది కాత్యాయని ఆలయం. ఈ దేవత యొక్క అత్యంత ప్రసిద్ధ ఆలయం కర్ణాటకలోని అవెర్సాలోని కాత్యాయనీ బనేశ్వర్ ఆలయం. కాత్యానిది మరొక ప్రసిద్ధ దేవాలయం బృందావన్ లో ఉంది.
అమ్మవారి నైవేద్యం …
నవరాత్రులలో ఆరవరోజైన దుర్గాదేవి కాత్యాయనిగా పూజలందుకుంటుంది. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి తేనెను ప్రసాదంగా పెట్టండి. ఇలా చేయటం వలన ఆమె భక్తులకు ప్రశన్నమై అన్నిరకాలైన కష్టాలు, వైవాహిక సమస్యలు తొలగించి జీవనం సుగమనం చేస్తుంది
కాత్యాయనీ దేవత స్తుతి …
యాదేవీ సర్వభూతేషు
కాత్యాయనీ రూపేణ సంస్థితా
నమస్తస్మైనమస్తస్మై నమస్తస్మై నమో నమః
::::::::::::::::::::::::::::::::::::::::::::::
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 వరకు దసరా మహోత్సవములలో అమ్మవారి దివ్య అలంకారములు కనకదుర్గమ్మ కి 10 రోజులు 10 అలంకారములు చేస్తారు. అందులో భాగంగా అక్టోబర్ 16 వ తేదీ శుక్ర వారం ఆశ్వీజ శుద్ధ పంచమి “శ్రీ సరస్వతి దేవిగా” ఆరవ రోజు అలంకారము చేస్తారు.
అమ్మవారికి నైవేద్యము: అటుకులు, బెల్లం, పరమాన్నం.
అమ్మవారి చీర అలంకారం: తెలుపు రంగు చీర
*********-----************
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com