ఓటీటీలోకి 'గరివిడి లక్ష్మి' బయోపిక్.. ఐదు భాషల్లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ జానపద గాయని, బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చిత్రం గరివిడి లక్ష్మి ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో ప్రాంతీయంగా మంచి ఆదరణ పొందిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ తాజాగా అధికారికంగా ఖరారైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 26 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఐదు ప్రధాన భాషల ప్రేక్షకులు తమ ఇంటి నుంచే ఈ జానపద కళాకారిణి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని వీక్షించే అవకాశం లభించనుంది. 1980, 90వ దశకాల్లో తన పాటలు, బుర్రకథలతో ప్రజలను ఉర్రూతలూగించిన గరివిడి లక్ష్మి జీవితంలోని ఆటుపోట్లు, కళా ప్రయాణాన్ని ఇందులో హృద్యంగా ఆవిష్కరించారు.
గౌరి నాయుడు జమ్ము దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ ఆనంది టైటిల్ పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనను కనబరిచారు. సీనియర్ నటుడు నరేష్, రాశి, రాగ్ మయూర్, శ్రీనివాస్ అవసరాల, అంకిత్ కొయ్య, ఎల్‌బీ శ్రీరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించి సినిమాకు బలాన్ని చేకూర్చారు. చరణ్ అర్జున్ అందించిన జానపద బాణీలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉత్తరాంధ్ర జానపద సంస్కృతిని, ఒక సామాన్య కళాకారిణి అసాధారణ ప్రస్థానాన్ని ప్రతిబింబించే ఈ సినిమా థియేటర్లలో మిస్ అయిన వారికి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చక్కటి అవకాశంగా మారనుంది.