ధరణి ఐ లవ్ యు మూవీ పోస్టర్ విడుదల చేసిన కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తూ కల్ట్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్కేఎన్ తాజాగా మరో కొత్త సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమంతో ముందుకొచ్చారు. సాయికృష్ణ కె.వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధరణి ఐ లవ్ యు’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో చిత్ర బృందం సమక్షంలో అత్యంత సందడిగా జరిగిన ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమం సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ వేడుకకు విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో సినిమా విశేషాలను చిత్ర యూనిట్ పంచుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ, ధరణి ఐ లవ్ యు సినిమా టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉందని, ఇది తొలి చూపులోనే ప్రేక్షులలో క్యూరియాసిటీని పెంచుతోందని ప్రశంసించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సాయికృష్ణ కె.వి గతంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ మూవీ మగధీర చిత్రానికి అసోసియేట్‌గా పని చేసిన అనుభవం ఉందని తెలిపారు. బేబీ వంటి వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న ఎస్కేఎన్, ఈ సినిమా కూడా ఘన విజయం సాధించి నిర్మాత రాజశేఖర్‌తో పాటు టెక్నీషియన్లకు మంచి పేరు తెచ్చిపెట్టాలని మనసారా ఆకాంక్షించారు.
డైరెక్టర్ సాయికృష్ణ కె.వి మాట్లాడుతూ, కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేతుల మీదుగా తమ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎస్కేఎన్ ఇండస్ట్రీలో తనదైన టైమింగ్, పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో దూసుకెళ్తున్న సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అని కొనియాడారు. స్టేజ్ మీద ఆయన చెప్పే రైమింగ్ డైలాగులు, స్పీచ్‌లకు తాను కూడా పెద్ద ఫ్యాన్ అని పేర్కొన్నారు. ఇక సినిమాకు సంబంధించి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ విడుదల చేయనున్నామని, ప్రేక్షకుల అందరి అంచనాలను అందుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించామని చిత్ర యూనిట్ వెల్లడించింది.