విశాఖ ప్రగతే లక్ష్యం.. ప్రజల విశ్వాసమే మా బలం!
గాజువాక, సూర్య : విశాఖ నగర ప్రజలు తమపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, నగరాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం గాజువాకలోని పార్టీ కార్యాలయంలో విశాఖ నగర మేయర్ ముక్కా శ్రావణి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి ప్రణాళికలు, ప్రజా సమస్యల పరిష్కారంపై వారు విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ ప్రజలు తమపై కొండంత విశ్వాసంతో అప్పగించిన బాధ్యతను స్వీకరించి, ఆ నమ్మకానికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రతిక్షణం శ్రమిస్తామని తెలిపారు. భవిష్యత్తులో విశాఖ నగరం సాధించే అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచేలా అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఉద్ఘాటించారు.
అనంతరం మేయర్ ముక్కా శ్రావణి మాట్లాడుతూ.. నగర ప్రజలతో పాటు తెదేపా శ్రేణులు తమపై ఉంచిన నమ్మకాన్ని పరిపూర్ణంగా నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. సమాజంలో మహిళా శక్తికి, వారి సాధికారతకు మొదటి నుంచీ పెద్దపీట వేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని కొనియాడారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కార్పొరేషన్‌లో దాదాపు 60 మంది మహిళలకు సముచిత స్థానం కల్పించారని, మహిళల పట్ల ఇంతటి నిబద్ధత, గౌరవం ప్రదర్శించే క్రమశిక్షణ కలిగిన పార్టీ మరొకటి లేదన్నారు. పల్లా శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో విశాఖ ప్రజలకు మరింత మెరుగైన సుపరిపాలన అందిస్తామని మేయర్ స్పష్టం చేశారు.